ఇక నుంచి ‘భూభారతి’ అమలు
- కూసుమంచి మండలంలో పోర్టల్‌ను ప్రారంభించిన అధికారులు..
- మోడల్ మండలంగా ‘కూసుమంచి’ ఎంపిక
- అన్ని గ్రామాల్లో భూ సర్వే..
- హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, నాయకులు
కూసుమంచి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ధరణి స్థానంలో ‘భూ భారతి‘ పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా భూభారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఆ పోర్టల్ ను ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను సిద్దం చేసింది.
ఈనెల 2 నుంచి రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట , ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా భూభారతి పోర్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి. వీటి ఫలితాలను బట్టి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది.
అమనగల్‌లో పోర్టల్ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి పథకాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి పోర్టల్ అమన్ గల్ లో ప్రారంభించారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ భారతిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
కూసుమంచి మండలంలో ప్రారంభం..
భూ భారతి పోర్టల్ ను అమలు చేసేందుకు ఐదు మండలాలను ఎంపిక చేయగా, అందులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంను మోడల్ మండలంగా ఎంపిక చేశారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు, 41గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో భూ భారతి పోర్టల్ ను ఏప్రిల్ 2 నుంచి అమలు చేయనున్నారు.
గురువారం కూసుమంచి మండలంలో భూ భారతి పథకాన్ని రెవెన్యూ అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ అనుదీఫ్ దురిశెట్టి పర్యవేక్షణలో అసిస్టెంట్ కలెక్టర్, తహసీల్దార్ ఆధ్వర్యంలో కూసుమంచి మండలంలోని ఓ గ్రామంలో భూభారతి పోర్టల్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ మండలం ఎంపిక చేసి, పోర్టల్ ను ప్రారంభించడంతో మండలంలోని రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటికి ధన్యవాదాలు చెబుతున్నారు.
భూ భారతి అమలు ఇలా..
గతంలో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లవలసిన పనిలేకుండా తన ఇంటి నుంచే భూ సేవలు పొందేవిధంగా పోర్టల్ను రూపొందించామని మంత్రి పొంగులేటి తెలిపారు. రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమి వివరాలు కనిపిస్తాయి. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలోని లైసెనస్డ్ సర్వేయర్ లాగిన్కు వెళ్తాయి. ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెనస్డ్ సర్వేయర్ ఖరారు చేసి రోవర్లతో సర్వే పూర్తి చేస్తారు.
సర్వే మ్యాప్ ను జనరేట్ చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. తరువాత తహశీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన వారికి ఎల్పిఎమ్, భూధార్ నెంబర్ల కేటాయింపు జరుగుతుంది. ఈ వివరాలు భూభారతి పోర్టల్లో కూడా నిక్షిప్తమవుతాయి. భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారంతో పాటు రెవెన్యూ వ్యవస్ధలో పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి చారిత్రాత్మక మార్పునకు భూభారతి పోర్టల్ నాంది అవుతుంది.




