మేడిగడ్డ పనిపట్టారుగా! X పాటిల్ క్షమాపణ చెప్పాలి
మేడిగడ్డ పనిపట్టారుగా!
- కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా కాళేశ్వరం
- ఆ ప్రాజెక్టు నిష్ప్రయోజనమన్న నివేదికలు
- కేసీఆర్‌ను సీఎం రేవంత్ జైలుకు పంపలేదేం?
- రాజ్యసభలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపాటు
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం ఓ ఏటీఎంలా వాడుకుంద ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇంజినీర్లను కూడా అడగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని, రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు ఖర్చుచేశారని మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం అంశంపై రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సురేష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తన వ్యాఖ్యలను ఉసంహరించుకోవాలని డిమాం డ్ చేశారు. అయితే సురేశ్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. మేడిగడ్డ పనికిరాకుండా పోవడానికి బీఆర్‌ఎస్ కారణమని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కొద్ది కాలంలోనే కుంగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం వల్ల ఉగయోగంలేదని నివేదికలు చెప్పాయని తెలిపారు. నిపుణులు, కాగ్ రిపోర్టుల్లోనూ అదే ఉందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రజల డబ్బుతో కట్టారా? లేక కేసీఆర్ సొంత డబ్బుతో కట్టారా? అంటూ ప్రశ్నించారు. రూ.లక్ష కోట్లు ఎక్కడినుంచి వచ్చాయని నిలదీశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలనుంచి నిధులు తీసుకొని కాళేశ్వరం నిర్మించారని స్పష్టంచేశారు.
ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపుతామని కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పిందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, తెలంగాణలో అధికారం లోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆ పని ఎందుకుచేయలేకపోయారని ప్రశ్నించారు.
భద్రాచలంలో ఉన్న గ్రామా లు ఏపీ పునర్విభజన చట్టంలో చేర్చారని.. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ఆనాడు 7 మండలాల విలీనానికి కేసీఆర్ ఒ ప్పుకున్నారని, విలీనం తర్వాత కూడా సోనియాగాంధీ ఇంటికి ఆయన వెళ్లారని గుర్తు చేశారు. కిషన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి వ్యాఖ్యలతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ జోక్యం చేసుకుని సభను అదుపు చేశారు.
కేంద్రమంత్రి పాటిల్ క్షమాపణ చెప్పాలి
- కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు
- రాజ్యసభలో బీఆర్‌ఎస్ సభాపక్ష నేత సురేష్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కాళేశ్వరం అంటే ఒక డ్యాం.. ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని రాజ్యసభలో బీఆర్‌ఎస్ సభాపక్ష నేత కేఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లేకపోయినా రాష్ట్రం స్వయంగా ముందుకు వచ్చి పనులను పూర్తిచేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి వచ్చిన విమర్శలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ. లక్ష కోట్లు వృథా అయ్యాయని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడారని, వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు సీఆర్ పాటిల్ క్షమాపణ చెప్పాలన్నారు. మేడిగడ్డ వద్ద కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ మొత్తం ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తంచేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని ఆయన సూచించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు వేరైనా ప్రజల మధ్య సోదరభావం కొనసాగాలని అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని సురేశ్‌రెడ్డి గుర్తుచేశారు. అదే సమయంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలబెట్టేందుకు తె లంగాణ నుంచి మద్దతు లభించిందని తెలిపారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యస భలో సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ఎంపీ సురేశ్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర విభజన విధానంపై బీజేపీ తరచుగా విమర్శలు చేస్తోందని సురేశ్‌రెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో తీసుకున్న నిర్ణయాలు అన్యాయంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. కేసీఆర్ చేసిన పోరాటం వల్లే తెలంగాణ సాకారమైందని సురేష్‌రెడ్డి అన్నారు. అమరుల త్యాగాల తో తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు.
దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలబెట్టామన్నారు. తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఏపీలో కలిపారని, అప్పుడు చర్చ జరగలేదని గుర్తుచేశారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోదీ అనేకసార్లు అన్నారని, దీనిపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ప్రశ్నించారు.
ఏపీ విభజన బిల్లును పునర్నిర్మాణ బిల్లుగా చేయొద్దు అని సూచించారు. 12 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయట్లేదని, కేం ద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, రాష్ట్రాన్ని దేశంలో ముందంజలో నిలిపారని ఆయన పేర్కొన్నారు.




