ప్రజా ప్రభుత్వంలో సరికొత్త భూ విప్లవం
- బంగాళాఖాతంలోకి ధరణి.. పారదర్శకంగా ‘భూ భారతి’
- రోవర్లతో భూ సర్వే.. ఇంటి నుంచే స్మార్ట్ సేవలు!
- 9 లక్షల సాదా బైనామాలకు విముక్తి
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
- రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో భూ భారతి కార్యక్రమం ప్రారంభం
ఆమనగల్లు, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి కార్యక్రమాన్ని బంగాళాఖాతంలో వేసి, తమ కాం గ్రెస్ ప్రభుత్వం పారదర్శకమైన ‘భూ భారతి’ని తెచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని రైతులకు భూ భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తెచ్చామని ప్రకటించారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి వార్డులో సమీకృత భూ భారతి పైలె ట్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజల కష్టాలను గాలికొదిలేశారని విమర్శించారు. ధరణి పోర్టల్ తెచ్చిన ఇబ్బందులను తొలగించేందుకే దానిని బంగాళాఖాతంలో కలిపి, పారదర్శకమైన భూ భారతిని ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలోని 72 రెవెన్యూ డివిజన్లలో భూ సర్వే ప్రారంభిస్తామని, ఇం దుకోసం 10,572 మంది గ్రామ పాలన అధికారులు, 5,300 మంది లైసెనస్డ్ సర్వేయర్లను నియమించామని చెప్పారు.
పాత పద్ధతులకు స్వస్తి పలికి 800 అత్యాధునిక రోవర్ యంత్రాల సహాయంతో వేగంగా సర్వే నిర్వహిస్తాం అని చెప్పారు. ప్రతి భూమి కి ఒక మ్యాప్‌ను సిద్ధం చేసి, రిజిస్ట్రేషన్ సమయంలోనే దానిని జత చేస్తామని, అనంత రం రైతులకు ఆధార్ కార్డు తరహాలో భూ ఆధార్ అందిస్తామని వెల్లడించారు. దీనివల్ల భూ తగాదాలకు తావుండదని అభిప్రాయపడ్డారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 9.21 లక్షల సాదా బైనామా సమస్యలను కొత్త జీవో ద్వారా పరిష్కరిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.
సాగులో ఉన్న రైతుల డిక్లరేషన్ ఆధారంగా వారికి హక్కులు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకులు టెర్రరిస్టుల వలె వ్యవహరిస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. ఓటమి తర్వాత కూడా వారి తీరు మారలేదని, వారి విజ్ఞతకే దానిని వదిలేస్తున్నామని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. చౌదర్‌పల్లి, కుప్పగండ్ల గ్రామాల్లో దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని, నియోజకవర్గానికి అదనంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ఆమనగల్లులో అన్ని డివిజనల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.




