25 July, 2026 | 4:26 AM

ఎయిర్‌పోర్ట్ పేరుతో రైతులను భయపెట్టొద్దు!

25-07-2026 12:35 AM

అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై వెంటనే స్పష్టత ఇవ్వాలి

రైతుల డిమాండ్

ఆదిలాబాద్, జూలై 24 (విజయక్రాంతి): అదిలాబాద్ ఎయిర్ పోర్ట్  ఎయిర్ ఫోర్స్ ప్రతిపాదన పేరుతో భయపెట్టొద్దనీ రైతులు వేడుకున్నారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతులను గతంలో పలుమార్లు అయోమయానికి గురి చేశారని ఆరోపించారు.

జూన్ 2న భూమి పూజ జరుగుతుందని ప్రచారం చేసి, ఆ తర్వాత వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని వార్తలు ప్రచారం చేయడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత రైతులతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని, భూ సేకరణకు సంబంధించిన నోటీసులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లు, అనుమతులు యథావిధిగా కొనసాగుతున్నాయని, అయినప్పటికీ ఎయిర్పోర్ట్ పేరుతో రాజకీయ ప్రచారం చేయడం వల్ల ప్రజలు, రైతులు అయోమయంలో పడుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల కారణంగా రైతులు తమ భూములు, ప్లాట్లు విక్రయించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు ఎయిర్పోర్ట్ సర్వే పూర్తయిందని చెబుతుండగా, మరోవైపు రైతులకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోవడం సందిగ్ధతకు దారితీస్తోందని అన్నారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి, ఎయిర్పోర్ట్ ప్రతిపాదనపై అధికారికంగా స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ను పలుమార్లు కోరినా ఇప్పటివరకు స్పందన లభించలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సి. నర్సింగరావు, కస్తాల అరుణ్, ముదిగొండ గంగాధర్, ముదిగొండ రమేష్, గొర్ల రాజు, జక్కుల దత్తు, రకుల్ జోషి, సిలారి పోశెట్టి, ముదిగొండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.