23 April, 2026 | 2:27 PM

Breaking News

గుర్వాయిగూడెంలో అక్రమంగా మట్టి తరలింపు.. జేసీబీతో సహా 8 ట్రాక్టర్లు సీజ్

23-04-2026 01:40 PM

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

జేసీబీ తో సహా 8ట్రాక్టర్లు సీజ్ 

కలెక్టర్ ఆదేశాలను పెడచెవిన పెట్టిన అక్రమదారులు

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలో మట్టిమాఫీయా జోరుగా సాగుతోంది.. రెవెన్యూ, పోలీసులు(Revenue Police), అధికారులు అనేక దఫాలుగా హెచ్చరించినప్పటికి మట్టి అక్రమ తరలింపు మూడుపువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.. రాజకీయాలను అడ్డుగా పెట్టుకుని ఇష్టానుసారంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో చెరువులో మట్టిని(మర్స)ను తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా మండలంలో మట్టి అక్రమ రవాణాపై మీడియాలో వరస కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ అనుదీఫ్ దురిశెట్టి స్పందించి గత రెండు రోజుల ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్.. అక్రమంగా మట్టి తరలింపు జరిపితే ఊరుకునేది లేదని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.. రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు క్లీయర్ ఇంటికేషన్ ఇచ్చారు.. అయ్యినప్పటికి మట్టి అక్రమ రవాణా అగడం లేదు..  ప్రకటన విడుదల చేసి రెండు రోజుల్లోనే చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలించేందుకు కొందరు వ్యక్తులు రాజకీయాలను అడ్డుగా పెట్టుకుని వ్యాపారం సాగిస్తున్నారు.

పట్టపగలే యదేచ్చగా భారీగా మట్టి తరలింపు

కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మట్టి అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది.. ముఖ్యంగా గుర్వాయిగూడెం గ్రామంలోని స్థానిక చెరువులో కొందరు వ్యక్తులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గత మూడు రోజులుగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్టపగలు జేసీబీ, ట్రాక్టర్ల తో మట్టిని అక్రమంగా దూరప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతి రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని వ్యాపార ప్రాంగణాలకు తరలిస్తూ భారీగా సంపాధిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆధాయానికి గండికొడుతున్నారు. ఇదేంటని ఎవరైన ప్రశ్నిస్తే ఓ పార్టీ నాయకులం, మా బండ్లనే ఆపుతారా..? అని కొందరు, మేము మంత్రి మనుషులని కొందరు అధికారులను బెదిరిస్తూ మట్టిని అక్రమంగా తరిలిస్తున్నట్లు తెలిసింది. అక్రమ రవాణాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, ఆయన మనుషులు సపోర్టు చేయరు. అలాంటి విషయంలో చర్యలు తీసుకోవాలనే చెబుతుంటారు..? అనేక సార్లు వేదికల పై కూడా మంత్రి, వారి అనుచరులు సైతం ఇదే చెప్పారు. అక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పినప్పటికి కొందరు మంత్రి పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారనే ప్రచారం ఉంది..  

జేసీబీ, 8ట్రాక్టర్లు సీజ్

కూసుమంచి మండలంలోని గుర్వాయిగూడెం చెరువులో బుధవారం అక్రమంగా మట్టిని తరలిస్తుండగా సమాచారం అందుకున్న కూసుమంచి రెవెన్యూ అధికారులు తహసీల్దార్ సైదులు, ఆర్ఐ రాము, సర్వేయర్ వెంకట్, జీపీవో, సిబ్బంది చెరువు వద్దకు వచ్చి మట్టిని తవ్వుతున్న జేసీబీని, తరలిస్తున్న 8ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని తనిఖీ చేసి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో కూసుమంచి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. జేసీబీ, 8ట్రాక్టర్ల పై రెవెన్యూ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాక్టర్లు, జేసీబీ కూసుమంచి మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. 

అనుమతులు లేకుండా మట్టి, మైనింగ్ తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు : సైదులు, తహసీల్దార్

కూసుమంచి మండలంలోని ఏ గ్రామంలోనైనా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు, తరలింపు జరిగినా, మైనింగ్ కు సంబంధించిన పనులు చేసిన అట్టి వాటిపై ఫిర్యాదు అందగానే తక్షణమే తనిఖీ చేసి వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. కలెక్టర్ అనుదీఫ్ ఇప్పటికే పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అనుమతులు లేకుండా మైనింగ్, మట్టి విక్రయాలు చేసిన, తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సూచించారు.