8 July, 2026 | 10:01 PM

అక్కా... ఫ్రీ బస్సు పథకం బాగుందా..?

08-07-2026 09:19 PM

– పల్లెవెలుగు బస్సులో మహిళలతో ఆత్మీయంగా ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్

నాగర్‌ కర్నూల్, విజయక్రాంతి: నాగర్‌ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పల్లెవెలుగు బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను ఆత్మీయంగా పలకరించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సందర్భంగా పల్లెవెలుగు బస్సు ఎక్కిన మంత్రి మహిళలతో కాసేపు ముచ్చటించారు. "అక్కా... ఫ్రీ బస్సు పథకం బాగుందా? ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారా?" అంటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై వివరాలు తెలుసుకుంటూ, ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.