గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కీలకం: కాటం వెంకటేశం
చిట్యాల,(విజయక్రాంతి): గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ, గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించాలని చిట్యాల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం అన్నారు.బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయ ఆదిత్య భవన్‌లో గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) అంశంపై నిర్వహించిన ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు చిట్యాల మండలంలోని సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, నిధుల సమర్థ వినియోగం, గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారుల బాధ్యతలు వంటి అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు.






