హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు బట్టబయలు
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): హైకోర్టు తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్రలు బట్టబయలయ్యాయని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు, గుండి సర్పంచ్ జబరి రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడిందని ఆరోపించారు. ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదని, కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్‌లా ఉందని విమర్శించారు. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ సెక్షన్ 8బీ, 8సీ నిబంధనలను పాటించకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నించిందని అన్నారు.
హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టు లాంటిదని, నివేదికలోని ప్రతికూల అంశాలను కోర్టు అమాన్యంగా ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేసి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇప్పటికైనా అహంకారం విడిచిపెట్టి రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, రాజంపేట సర్పంచ్ బుర్స పోచయ్య, ఉపసర్పంచ్ మామిడి లక్ష్మి, కౌన్సిలర్లు సలాంబిన్ అహ్మద్, నాగజ్యోతి, మాజీ సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, టౌన్ అధ్యక్షుడు అహ్మద్, నాయకులు నిస్సార్, పొన్నాల నారాయణ, బానోతు బలరాం, సాయి శ్రావణ్, ఇప్ప నాగరాజు, సీహెచ్ రవి, ఎండీ ఖాసీం, ఉమారాణి, అన్సార్, దిలీప్, భీమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.






