అక్రమంగా ‘మట్టి’ నిలువ!
మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): వర్షాకాలంలో వాగుల నుంచి ఇసుక తరలింపు అసాధ్యం కావడంతో, వేసవిలోనే అక్రమంగా ఇసుకను తవ్వి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో నిలువ తీసుకొని తర్వాత నింపాదిగా విక్రయించడం ఇంతవరకు జరుగుతోంది. ఇసుక తరహాలో ఇప్పు డు మట్టి అక్రమ నిల్వలు, రవాణా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. అనేకచోట్ల చెరువులు, కుంటల్లో మట్టిని పెద్దపెద్ద యంత్రాలతో తవ్వి తమకు అనుకూల మైన ప్రదేశాలకు రాత్రికి రాత్రి చేర్చి నిలువ చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ ద్వారా కొంత మొత్తానికి మట్టి తీయడానికి అనుమతి తీసుకొని, దాన్ని సాకుగా చూపి వందలాది డంపర్ల మట్టిని సురక్షిత ప్రాంతాలకు చేర్చి నిలువ చేస్తున్నారు. వర్షాలు కురిస్తే మట్టి చెరువుల నుండి తీసుకునే పరిస్థితి లేకపోవడంతో, ముందుగానే అందిన కాడికి మట్టిని తవ్వి పెద్ద ఎత్తున నిలువ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒక్కో డంపర్ కు ఐదు నుండి ఎనిమిది వేల వరకు మట్టి విక్రయి స్తూ మట్టి అక్రమ రవాణా దందాను యదేచ్చగా సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నా యి.
ఇష్టానుసారంగా మట్టిని చెరువుల నుండి తొవ్వి ఇటుక బట్టీలకు నల్ల రేగడి, మోరం మట్టిని నిర్మాణాల్లో వినియోగిస్తున్నారు. వర్షాలు త్వరగా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటిస్తుండడంతో, చెరువులు, కుంటల్లో మట్టి రవాణా వ్యవహారం మరింత వేగంగా సాగుతోందనే విమ ర్శలు వస్తున్నాయి. చెరువులు, కుంటల్లో మ ట్టిని బాహాటంగా అక్రమంగా తరలించుకుపోతున్నప్పటికీ ఏ అధికారి కూడా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామ చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నల్లరేగడి, మొరం మట్టిని పెద్ద ఎత్తున తరలించారని, దీనితో తమ చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, భూగర్భ జలాలు చెరువులో నిలిచి ఉండే పరిస్థితి లేదని, అడ్డదిడ్డంగా తవ్వడంతో చెరువులో నీరు పూర్తిగా ఇంకిపోయే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు బుధవారం మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అసలు ఆ మట్టి తొలగించడానికి అనుమతి ఎలా ఇచ్చారు, ఎంత మేరకు మట్టి తొలగించాలి, ఏ విధానంలో మట్టిని తొలగించాలి అని పరిశీలించకుండానే, మట్టి తీసుకువెళ్లే వ్యక్తులకు అనుమతి ఇవ్వడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తమ చెరువును సర్వనాశనం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ లేకుండా మట్టి తరలింపుకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకోవాలి
వర్షాకాలానికి ముందే చెరువుల నుండి ముందస్తు చూపుతో వందల ట్రిప్పుల మట్టిని తీసుకువచ్చి తమకు అనుకూలమైన ప్రదేశాల్లో నిలువ చేసిన మట్టిని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వందల ట్రిప్పుల మట్టిని అక్రమంగా విక్రయించుకొని, సొమ్ము చేసుకోకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. అక్రమ ఇసుక రవాణా మాదిరిగా మారిన మట్టి రవాణా వ్యవహారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, లేదంటే రాబోవు రోజుల్లో చెరువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






