22 April, 2026 | 4:33 AM

కష్టపడి పనిచేస్తే ఏ లక్ష్యమైనా సాధ్యం

22-04-2026 01:23 AM
  1. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  2. ఇంటర్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులకు ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థు లను అభినందిస్తూ, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని, కష్టపడి పని చేస్తే ఎంతటి విజయమైనా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తన చిన్నతనంలో తనకు ప్రత్యేకమైన కలలు లేదా ఆత్మవిశ్వాసం లేవని, అయితే ఇంటర్ ఫలితాలు తనలో నమ్మకాన్ని పెంచాయని తెలిపారు. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించగలమనే విశ్వాసం అప్పుడు కలిగిందని చెప్పారు. ప్రస్తుతం మంచి మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిలో ప్రతిభ, మేధస్సు ఉన్నాయని, వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.

అలాగే, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, లెక్చరర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్  ప్రభుత్వ విద్యార్థినీ, విద్యార్థులను ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కే.రవిబాబు, కెజిబివి, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్, ఆర్జేసీ, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్, అంబేద్కర్ కళాశాల, మోడల్ కాలేజీ ఎస్‌ఓలు, సంబంధిత అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.