22 April, 2026 | 2:57 AM

కేసీఆర్ స్టేట్స్ మన్.. రేవంత్‌రెడ్డి స్ట్రీట్ మన్

22-04-2026 01:21 AM

కేసీఆర్ సభకు పోటీగానే రేవంత్‌రెడ్డి సభ

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రేవంత్ తీరు  

  1. కేసీఆర్‌కు భయపడే రైతుభరోసా విడుదల
  2. ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణ
  3. స్టే వెకేట్ అయితే రేవంత్ పదవి ఉడటం, జైలుకెళ్లడం ఖాయం
  4. మాజీ మంత్రి హరీశ్‌రావు వెల్లడి 

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జగిత్యాలలో కేసీఆర్ సభ ఉన్నదని ముందే తెలిసి, పోటీగా అదే జిల్లాలో అదే సమయానికి రేవంత్‌రెడ్డి సభ పెట్టి మాట్లాడటం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ మాట్లాడటం మొదలవగానే అదే సమయానికి మైకు పట్టుకోవడం సీఎం స్థాయికి తగదన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని లైవ్‌లో 36 లక్షల మంది చూస్తే.. రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని కేవలం 4 లక్షల మంది మాత్రమే చూశారని, కేసీఆర్ వ్యూవర్ షిప్‌లో కనీసం 10 శాతం కూడా రేవంత్‌కు రాలేదని ఎద్దేవాచేశారు.

బీఆర్‌ఎస్ అఫీషియల్ లైవ్‌లో 2 వేల మంది చూస్తే, కాంగ్రెస్ లైవ్‌లో కేవలం 54 మంది ఉన్నారని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్లలో రేవంత్ స్థాయి ఎక్కడికి పడిపోయిందో, కేసీఆర్ మీద ప్రజల్లో ఉన్న అభిమానం ఏంటో ఈ లెక్కలే చెబుతున్నాయన్నారు.

పాలించిన కేసీఆర్ హుందాగా, రేవంత్‌రెడ్డి పేరు ఒక్కసారి కూడా తీయకుండా రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడితే.. రేవంత్ మాత్రం రంకెలు వేయడం, ఏడ వడం తప్ప ఇంకేం చేయలేదని దుయ్యబట్టారు. రేవంత్ తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చెప్పిన మాటలు విని తప్పు లు సరిదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లునా దక్కుతాయన్నారు.

రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయం

పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి అని హరీశ్‌రావు ఆరోపించారు. ‘ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి, వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు. ఈ ఓటుకు నోటు కేసులో బీఆర్‌ఎస్ తరఫున జగదీశ్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇంప్లీడ్ అయ్యారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ కాదా? బుధవారం సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉంది.

నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్‌కు ఆ స్టే వెకేట్ అయిందంటే సీఎం సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ గర్జిస్తారని భయపడే రాత్రికిరాత్రి ఒక ఎకరానికి కిస్తీ వేశాడని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్ష కోట్లు కొట్టుకుపోయాయని నిన్నటిదాకా దుష్ప్రచారం చేసిన వ్యక్తి..

ఇవాళ మేడిగడ్డ రిపేరు చేసుకుని వాడుకుంటామని ఒప్పుకున్నాడని, రెండు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మిడ్ మానేరు నుంచి మధ్యస్థంగా నీరుంటే ఎల్లంపల్లి నుంచి, కరువు వస్తే మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేసుకునేలా కాళేశ్వరాన్ని డిజైన్ చేశారని తెలిపారు.

కాళేశ్వరంలో భాగమే గందమల్ల 

రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన గందమల్ల కూడా కాళేశ్వరంలో భాగమేనని హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌసులు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కెనాల్, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి లిఫ్ట్, మొత్తంగా 240 టీఎంసీల వినియోగమన్నారు. లోయర్ మానేరు నుంచి సూర్యపేట దాకా నిండిన చెరువులు, కూడవెల్లి, హల్దీ వాగులు పొంగడం, అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిండటం కాళేశ్వరం ఫలితాలు కాదా? అని ప్రశ్నించారు. 

నేను మంత్రిగా ఉన్నప్పుడు నా వెనుక తిరిగాడు 

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాడు శిలాఫలకం మీద రాష్ట్ర మంత్రిగా తన పేరుందని, ఆనాడు మంత్రిగా ఉన్న నా వెనుక రేవంత్‌రెడ్డి నెక్కర్లు వేసుకుని తిరిగాడని, కావాలంటే వీడియోలు పంపిస్తానని హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదని, ముంపు బాధితులకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాలతో రూ.2,052 కోట్లు ఖర్చు పెట్టి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు కట్టించి ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది తాను మంత్రిగా ఉన్నప్పుడేనని చెప్పారు.  

ఎన్ని డ్రామాలేసినా మళ్లీ సీఎం కావు

కాంగ్రెస్‌కు ప్రజలెందుకు ఓట్లు వేయాలో రేవంత్‌రెడ్డి చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుభరోసా ఎగ్గొట్టినందుకా? తెలం గాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించినందుకా?, తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఢిల్లీకి కప్పం కడుతున్నందుకా? 2 లక్షల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకా? మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వనం దుకా? రాష్ట్రాన్ని స్కాములతో నింపినందుకా? సింగరేణిని దోచుకున్నందుకా?, హైడ్రా పేరు తో పేదల ఇండ్లు కూలగొట్టినందుకా? ఖమ్మం వెలుగుమట్లలో వేల ఇండ్లు కూల్చినందుకా?,  ఉద్యోగులను మోసం చేసినందుకు మళ్లీ అధికారం ఇవ్వాలా అని హరీశ్‌రావు నిలదీశారు.

అధినేత ఆదేశాల మేరకే ఢిల్లీకి.. 

‘మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకే తాను, ఎంపీ రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బహిరంగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లాం. రేవంత్‌రెడ్డి మాత్రం తన మీడియా ద్వారా లీకులు ఇస్తూ డ్రామాలు ఆడాడు. విషయం లేని వాళ్లే ఇలాంటి చిల్లర పనులు చేస్తారు. కాళేశ్వరం కేసులో తీర్పు ఏవిధంగా వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, అలాగే మే 6న హైకోర్టులో రాబోతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల కోసం సీనియర్ లాయర్లను సంప్రదించడానికి ఢిల్లీ వెళ్లాం’ అని హరీశ్‌రావు వివరించారు.