30 April, 2026 | 5:10 AM

అన్నింటా నియోజక వర్గాన్ని ముందుంచుతా

30-04-2026 02:30 AM

మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఏప్రిల్ 29: చెన్నూర్ నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతానని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో రహదారులు, మురుగు కాలువల అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 300 బోర్ వెల్స్ ఏర్పాటు చేశామన్నారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నామన్నారు. నిరుద్యోగ యువతకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా జర్మన్ భాషను నేర్పించి ఉద్యోగ కల్పన దిశగా కృషి చేస్తున్నామన్నారు. రహదారుల విస్తరణలో భాగంగా భూ నిర్వాసితులకు రూ. 26 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి, చెన్నూర్ మండలాల తహసిల్దార్లు రాఘవేంద్రరావు, వనజ రెడ్డి, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.