హాలీవుడ్ స్థాయికి హైదరాబాద్
- నెటిఫ్లిక్స్ రాకతో కల నిజమైంది
- ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్
- భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం
- హైటెక్ సిటీలో నెటిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): నెటిఫ్లెక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే అని సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచ సినిమా సాంకేతిక హబ్‌గా అవతరిస్తోందన్నారు. ఓటీటీ దిగ్గ జం నెటిఫ్లెక్స్ హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక నెటిక్స్ ఐలైన్ స్టూడియోను సీఎం గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంకేతిక తను నగరానికి తీసుకురావడం ద్వారా తన కల నిజమైందని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చే క్రమంలో ఇది ఒక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ముంబై తర్వాత నెటిఫ్లెక్స్ దేశంలో ఏర్పాటు చేసిన రెండో భారీ కార్యాలయం ఇదే కావడం విశేషమన్నారు.
తమ దృష్టి హాలీవుడ్ ప్రమాణాల పైనే ఉంటుందని, నెటిఫ్లెక్స్ రాకతో ఆ దిశగా కీలక అడుగు పడిందన్నారు. ‘హైదరాబాద్ అన్ని రకాల అవకాశాలకు నిలయం. ఇక్కడ పెట్టుబడులు పెట్టే ప్రతి కంపెనీకి మా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉం టుంది’ అని హామీ ఇచ్చారు. తెలంగాణలో నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ గురించి సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
నెటిఫ్లెక్స్ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని, తమ కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీలో నిర్మించుకోవాలని, అందుకు కావాల్సిన భూమిని ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రపంచంలోని టాప్ 500 కంపెనీలను తెలంగాణకు తీసుకురావడమే మా లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు భరోసా కల్పి స్తూ.. తెలంగాణ అంటేనే వ్యాపారం. ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి, ప్రతి సం స్థకు పూర్తి రక్షణ ఉంటుందన్నారు.




