జైనూర్‌లో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం
జైనూర్,(విజయక్రాంతి): జైనూర్‌లో చిన్న చినుకు పడినా, కాస్త ఈదురు గాలులు వీచినా విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు ఆరోపించారు. జైనూర్‌లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, కుమ్రం భీం జిల్లాలో విద్యుత్ అధికారులు ఉన్నారా లేదా, అసలు విధులు నిర్వహిస్తున్నారా లేదా అనే అనుమానం కలుగుతోందని ఆయన విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ చీకటి రోజులు వస్తాయి అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని, ప్రజలు వినకుండా ఆశపడి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఓటు వేసి నాటి ఆంధ్రప్రదేశ్‌లోని చీకటి రోజులను తిరిగి తెచ్చుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.






