23 May, 2026 | 1:05 PM

నిద్రిస్తున్న కుటుంబంపైకి దూసుకెళ్లిన ట్రక్కు— నలుగురు మృతి

23-05-2026 11:39 AM

ట్రక్కు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కుటుంబాన్ని నుజ్జునుజ్జు చేసిన ట్రక్కు

బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బారాబంకిలో(Barabanki) శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎండాకాలం కావడంతో వేడికి తట్టుకోలేక తమ ఇంటి బయట నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని వేగంగా వస్తున్న డంపర్ ట్రక్కు(Dumper truck) ఢీకొనడంతో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతులను నీరజ్ (35), అతని కుమారుడు అనురాగ్ (13), కుమార్తెలు అన్షిక (10),  అన్షు (6)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో నీరజ్ భార్య ఆర్తి (35) తీవ్రంగా గాయపడగా, మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వేగంగా వస్తున్న డంపర్ మొదట ఒక చెట్టును ఢీకొట్టి, రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుటుంబాన్ని తొక్కేసిందని వారి బంధువులు తెలిపారు. 

స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అద్దెకు తీసుకున్న మ్యాజిక్ వాహనాన్ని నడుపుతూ నీరజ్ జీవనం సాగించేవాడని, ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝన్సా గ్రామంలో తన కుటుంబంతో కలిసి నివసించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, వేడి భరించలేనంతగా పెరిగిపోవడంతో ఇంటి బయటే నిద్రించాలని తాము నిర్ణయించుకున్నట్లు నీరజ్ మేనమామ కృపారామ్ చెప్పారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం తరలించామని, చట్టపరమైన లాంఛనాలు పూర్తయిన అనంతరం మృతుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని బారాబంకి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.