భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి, (విజయక్రాంతి): వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డితో కలిసి శనివారం వనపర్తి పట్టణంలోని శ్రీనివాసపూర్‌లో రూ.7.50 కోట్ల (రూ.5 కోట్లు ఇప్పటికే మంజూరు కాగా, అదనంగా మరో రూ. 2.50 కోట్ల) వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణానికి సంబంధించిన ఇంజినీరింగ్ మ్యాప్‌ను పరిశీలించి, జరుగుతున్న నిర్మాణ పనులను అధికారులు వివరించారు. భవనం వద్ద నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను సమర్థవంతంగా నిర్మించాలని, అలాగే కాంపౌండ్ వాల్ మరియు ఎలివేషన్ పనులను ఆకర్షనీయంగా, నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. భవన నిర్మాణం వల్ల ప్రభావితమవుతున్న వారికి ఇంటి స్థలాలు అందజేస్తామని కలెక్టర్ మరియు ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే భవన నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేసి, త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఈ ఈ, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.






