జనరల్ ఆసుపత్రి సిబ్బంది చేతివాటం..!
రోగుల వద్ద డబ్బుల వసూళ్లు
వైరల్‌గా మారిన వీడియో
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో(Nagarkurnool District General Hospital) వార్డ్ బాయ్ రోగుల వద్ద డబ్బులు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగికి డ్రెస్సింగ్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని వార్డ్ బాయ్ డిమాండ్ చేయడంతో రోగి బంధువులు ఫోన్‌పే ద్వారా వార్డ్ బాయ్ నంబర్‌కు డబ్బులు పంపారు.
ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి మొబైల్‌లో వీడియోగా రికార్డు చేయగా, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్(Deputy Superintendent) డాక్టర్ శేఖర్ వెంటనే విచారణకు ఆదేశించారు. సంబంధిత ఎమ్‌ఎమ్‌ఓకు మెమో జారీ చేసినట్లు తెలిపారు. ఆయన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రోగులు ఉచితంగా చికిత్స పొందవచ్చని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.




