పెచ్చులూడుతున్న హాస్టల్ బిల్డింగ్!
- దోమకొండ బీసీ వసతి గృహ దుస్థితి
- భయాందోళనలో విద్యార్థులు
దోమకొండ, ఆగస్టు 10 (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పైకప్పు నుంచి తరచూ స్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలంలో హాస్టల్ పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.
పైకప్పు నుంచి నీరు కారడంతో గదుల్లోకి వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు స్లాబ్ పెచ్చులు ఊడిపడుతుండటంతో విద్యార్థులు గదుల్లో ఉండేందుకు సైతం భయపడుతున్నారు. వర్షం పడుతున్న సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం హాస్టల్ భవనం నిర్వహణపై సరైన శ్రద్ధ లేకపోవడం, మౌలిక వసతులు మెరుగుపడకపోవడంతో విద్యార్థులు హాస్టల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
భవనం పరిస్థితి కారణంగా విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుముఖం పడుతోందని వారు చెబుతున్నారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు సమస్యను పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఆందోళన తమ పిల్లలను చూసేందుకు హాస్టల్కు వచ్చిన తల్లిదండ్రులు భవనం పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నారు.
పిల్లలను ప్రమాదకర భవనంలో ఉంచడం సరికాదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. హాస్టల్ భవనం పరిస్థితిపై సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు సమస్యను వివరించినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలి
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి బీసీ హాస్టల్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న పైకప్పు, స్లాబ్ పెచ్చులు, వర్షపు నీరు కారే సమస్యలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే భవనానికి పూర్తిస్థాయి మరమ్మతులు లేదా నూతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.






