రాయదుర్గంలో హిట్ అండ్ రన్
ఒకరు మృతి, మరోకరికి తీవ్ర గాయాలు
ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ అరెస్ట్
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాయదుర్గం పోలీస్ స్టేషన్(Raidurg Police Station) పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండంచెల రోడ్డు ప్రమాదంలో బీహార్‌కు చెందిన రోజువారీ కూలీ నందులాల్ ప్రాణాలు కోల్పోయాడు. సాయం చేయడానికి ముందుకొచ్చిన విద్యార్థి జైద్ షా ఖాద్రీ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి సంబంధిత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నందులాల్ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.
రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని చూసి సమీపంలో ఉన్న విద్యార్థి జైద్ షా ఖాద్రీ వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.అయితే ఆ సమయంలో మరో వాహనం వేగంగా వచ్చి వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ రెండో ఢీకు నందులాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి తీవ్ర గాయాలతో సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రమాదం జరిగిన వెంటనే రెండో వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ, వాహన వివరాలు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో రెండో ప్రమాదానికి సంబంధించిన కారు ఆనంద్ సాయి కుమారుడు సందీప్ నడిపినట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే మాదాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్ వద్ద మరో ప్రముఖ కుటుంబానికి చెందిన యువకుడి కారు ప్రమాదంలో యువతి మృతి చెందిన కేసు కూడా పరిశీలనలో ఉంది.రెండు సంఘటనల్లోనూ వేగం, బాధ్యత,చట్టం ముందు అందరూ సమానమా అన్న ప్రశ్నలు తిరిగి తెరపైకి వచ్చాయి.






