పట్టు పరిశ్రమతో రైతులకు అధిక ఆదాయం
జిల్లా కలెక్టర్ కె.హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 29: అధిక ఆదాయం సమకూర్చే పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. కలెక్టరేట్లో బుధవారం పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మేరా రేషన్ మేరా అభియాన్ 2.0’ జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 1,313 ఎకరాల్లో 482 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారని, ఈ ఏడాది మరో 200 ఎకరాల విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
పట్టు పరిశ్రమకు జిల్లాలో అనుకూల పరిస్థితులు, మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని,ఒక ఎకరంలో ఏడాదికి ఐదు పంటలు తీసుకుని రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విజయవంతమైన పట్టు క్షేత్రాలకు అధ్యయన పర్యటనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టు మార్కెటింగ్కు అవసరమైతే భూమి కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర నోడల్ అధికారులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.






