కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో(Karachi) వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు(Heavy Rains), ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఈదురు గాలుల వల్ల ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మావచ్ గోత్ ప్రాంతంలో రెండస్తుల భవనం కూలిపోయింది. కరాచీలో గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
విద్యుత్ తీగలు తెగిపోవడంతో కరాచీలోని 60 శాతం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో మేయర్ కరాచీ నగరంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోవడం, విద్యుదాఘాతం, చెట్లు, సైన్‌బోర్డులు పడిపోవడంతో ప్రాణనష్టం జరిగింది. గురువారం మరింత వర్షం, బలమైన గాలులు వీస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ అంచనా వేసింది.




