29 July, 2026 | 3:01 AM

హైదరాబాద్‌లో భారీ వర్షం

29-07-2026 01:26 AM

జలమయమైన రోడ్లు

వాహనదారులకు ఇబ్బందులు 

పలు జిల్లాల్లో జోరు వాన

రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల మీదకు వరద నీరు రావడంతో పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఏర్పడింది. ఆదిలాబాద్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.

మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లోని మియాపూర్, కూకట్‌పల్లి, రాయదుర్గం, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్, యూసుఫ్‌గూడ, ఖైరతాబాద్, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, నాచారం, కాప్రా ప్రాంతాల్లో భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.

హైటెక్‌సిటీ, మాదాపూర్, మియపూర్, చందానగర్‌తో పాటు మలక్‌పేట, చాదరఘాట్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, సీపీతో ఫోన్లో ఆయన మాట్లాడారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

ఏజెన్సీలో భారీ వర్షం

ఉట్నూర్: అదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఏజెన్సీ గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి. ఏజెన్సీలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ మండలాల పరిధిలోని మారుమూల గ్రామాలకు అడ్డంగా ఉన్న వాగులు వర్షానికి పారుతున్నాయి. దీంతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ప్రాణాలు అరిచేతులో పెట్టుకొని వాగులు దాటవలసిన పరిస్థితి నెలకొంది. ఉట్నూర్ మండలం గంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల రాజంపేట్, వంకతుమ్మ ‘ఎ’, వంకతుమ్మ ‘బి’ గ్రామ ప్రజల పరిస్థితి వర్షాకాలంలో అత్యంత దయనీయంగా మారుతోంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు స్థానిక వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో, ఈ మూడు గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూడు గ్రామాలకు వెళ్లే ముఖ్య రహదారిలోనే ఈ వాగు ఉండటం వల్ల, చిన్నపాటి వర్షం పడినా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతోంది. 

పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు

పాపన్నపేట: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ముందు నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువన నుంచి వరద వస్తుండడంతో 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట పూర్తిగా నిండి పొంగి పొర్లుతుంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయల మీదుగా కిందికి ప్రవహిస్తుంది. 

మరో రెండు రోజులూ భారీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతూ బలపడుతుంది. నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో కురుస్తాయని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే 30 కి.మీ. వేగంతో బలమైన ఉపరితల గాలులు కూడా అన్ని జిల్లాల్లో వీస్తాయని పేర్కొంది.