శస్త్రచికిత్స కోసం వెళ్తే.. శవమై వచ్చాడు
- హస్తినాపురంలోని ‘వెల్ నెస్’ దవాఖానలో ఘటన
- కిడ్నీలో రాళ్లు వచ్చాయని.. శస్త్ర చికిత్సకు చేరితే
- చనిపోయిన విషయం చెప్పని దవాఖాన వైద్యులు
- న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన
ఎల్బీనగర్, జూలై 26 : హస్తినాపురం డివిజన్, మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హస్తినాపురంలోని వెల్ నెస్ దవాఖానలో శస్త్ర చికిత్స కోసం చేరితే శవమై వచ్చిన ఘటన ఆదివారం అర్ధరాత్రి వెలుగులోకి వచ్చింది. చనిపోయిన విషయం కూడా అర్థరాత్రి చెప్పారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని ఆరోపిస్తూ దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేసి, కుర్చీలు విరగొట్టి సాగర్ హైవే పై ధర్నా చేశారు.
విషయం తెలుసుకున్న మీర్ పేట్ పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు. మహేశ్ (34) అనే వ్యక్తి కిడ్నీలో రాళ్లు రావడంతో ఇబ్బంది పడుతూ హస్తినాపురం లోని వెల్ నెస్ దవాఖానలో శస్త్ర చికిత్స కోసం చేరాడు.
సర్జరీ చేస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు మహేశ్ మృతి చెందాడు. చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న మృతుడి బంధువులు ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసి సాగర్ రోడ్డుపై ధర్నా చేశారు. సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్ మృతిపై రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి విచారణ చేపట్టారు.






