28 July, 2026 | 12:56 AM

ఉత్తోళ్లకే ఉపాధి పైసలు..!

28-07-2026 12:00 AM
  1. అక్రమార్కులకు జాక్పాట్ ఉపాధి 
  2. 100 ఎకరాల ఆసామికీ జాబ్ కార్డు
  3. లండన్లో ఉన్నా కూలీ డబ్బులు.             
  4. గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో లక్షల ‘ఉపాధి’ పైసలు పనిచేయని వారి ఖాతాలకు...
  5. నోరెళ్లబెడుతున్న జనం
  6. అధికారుల తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు..

సూర్యాపేట, జూలై 27 (విజయక్రాంతి): పేదవాడి ఆకలి తీర్చాల్సిన పథకం... అక్రమార్కుల జేబులు నింపుతోంది రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ పూట గడవని కూలీల కష్టాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి జేబులు నింపుకుంటున్నారు. ఇది జిల్లాలోని పలు మండలాల్లో ఈ తంతు జరుగుతుందనేది చాలా సందర్భాలలో వెలుగులోకి వచ్చింది. కానీ గరిడేపల్లి మండలంలో ఇది ఇంకాస్త తీవ్రరూపం దాల్చి పని చేయని వారిక్ కాదు అసలు సంవత్సరాల తరబడి ఇతర దేశాలలో ఉంటున్న వారి ఖాతాలకు పైసలు వెళ్లడంతో మండలంలో ఇది పెద్ద చర్చే సాగుతుంది 

 గడ్డిపల్లిలో వెలుగులోకి 

మండలంలోనిగడ్డిపల్లి గ్రామంలో మొ త్తం 600 నుండి 650 మంది వరకు ఉపా ధి హామీ పనులకు వెళ్తున్నట్లు రికార్డులలో అయ్యి ఉన్నట్లు కొందరు ఉపాధి కూలీల ద్వారానే తెలుస్తుంది. అయితే ఇందులో కొందరు అసలు పని చేయని వారు ఉన్నా రు. ఇంత వరకు బాగానే ఉంది కానీ గ్రా మంలో ఏకంగా 350 మందికి పైగా అసలు పనికి వెళ్లని వారి ఖాతాలకు పైసలు వెళ్ళడంతో ఇది గమనించిన వారి ద్వారా ఈ తంతు వెలుగులోకి వచ్చింది.

లండన్‌లో ఉంటూ గ్రామంలో పని

లండన్లో జీవిస్తున్న ఒక వ్యక్తి పేరు మీద ఇక్కడ గడ్డిపల్లిలో ‘జాబ్ కార్డు’ ఉంది. ఆయన ఏండ్ల తరబడి అక్కడే ఉంటున్నాడు. కానీ కొందరు ఉపాధి సిబ్బంది పనితనంతో ఆయన ఇక్కడ మట్టి మోస్తున్నట్లు హాజరు వేసి నెల నెలా బిల్లులు చేశారు. ఆయన ఖా తాలో వేల రూపాయలు జమ కావడంతో దర్జాగా బొక్కేస్తున్నారు. 

వ్యాపారులకు ఆదాయ వనరు

గ్రామంలో ఇంతవరకు ఎప్పుడూ పనికి వెళ్ళని వ్యాపారుల భార్య భర్తలకు హాజరు వేసి ఒక్కొక్కరి ఖాతాలో 15000 చొప్పున జమ అయినట్లు గ్రామస్తులు వెళ్లించారు. విచారణకు వచ్చిన అధికారులతో సైతం గ్రామస్థులు చెప్పినప్పటికీ తనకు డబ్బులు రాలేదని వ్యాపారి చెప్పడం గమనార్హం.

భూస్వాములు పెన్షనర్లకు

గ్రామంలో 70 ఏళ్లు దాటి, ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతున్న వృద్ధుల పేర్లపైనా ఉపాధి డబ్బులు జమ అవుతుండడం ఆశ్చర్యకరమైన విషయం. 100 ఎకరాల భూమి ఉన్న బడా ఆసామి పేరు కూడా ఈ ఉపాధి జాబ్ కార్డుల లిస్టులో ఉండటం వీరి అవినీతికి పరాకాష్ట.

నిజమైన కూలీలకు అన్యాయం

నిజంగా పనికి వెళ్లిన నిరుపేద కూలీలకు వారానికి మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే కూలీ పడితే... ఒక్క రోజు కూడా పనికి రాని ’దొంగ కూలీల’ ఖాతాల్లో మా త్రం వారానికి ఆదివారంతో సహా ఏడు రో జులూ డబ్బులు జమయ్యాయి. పైగా, కొందరికి కొత్తగా జాబ్ కార్డులు ఇప్పిస్తామని చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న దారుణం కూడా ఇక్కడ సాగుతోంది.

సూత్రధారులు.. పాత్రధారులు

ఈ భారీ దోపిడీ వెనుక ఒక పెద్ద ముఠా ఉందనేది గ్రామస్తుల అనుమానం.అయితే తాజాగా జరుగుతున్న చర్యలు పరిశీలిస్తే నిజమనక తప్పదు. పోస్ట్ ఆఫీస్ సిబ్బందితో కు మ్మక్కు ప్రభుత్వం విడుదల చేసే డబ్బులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో పడుతుంటే అక్కడ ఖాతాదారులకు తెలియకుండానే అధికారులు/సిబ్బందిని మేనేజ్ చేసి ఈ నిధులను విత్డ్రా చేసుకుంటున్నట్లు సమాచారం.

 సిండికేట్ గా మారిన అధికారులు ఏపీఓ కార్యదర్శి (రూపావత్ సైదులు), ఫీల్ అసిస్టెంట్ (అనిత), గడ్డిపల్లి విలేజ్ మేట్ (ఎం. పురుషోత్తం), ఎర్రకుంట విలేజ్ మేట్ (సౌజన్య) , స్థానిక సర్పంచ్.. వీరంతా ఒక సిండి కేట్గా ఏర్పడి ఈ దందాను నడిపిస్తున్నారని ఇటీవల విచారణ అధికారులకు గ్రామస్తులు వెల్లడించారు.

సమగ్ర విచారణ జరగాల్సిందే!

పేదల కష్టాన్ని, ప్రభుత్వ నిధులను దొంగిలిస్తున్న ఈ ‘ఉపాధి నెట్వర్క్’పై సమగ్ర విచారణ జరిపించాలి. ఇప్పటికే ఈ విషయంపై విచారణకు వచ్చిన అధికారులకు ప్రజలు చెబుతున్న నిజాలను పరిశీలించి ఉత్తోళ్లకు వచ్చిన ఉపాధి పైసలను వెలుగులోకి తీసి దానికి బాధ్యులైన అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని నిజమైన ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఇది గడ్డిపల్లి గ్రామానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు మండలంలోని ఇతర గ్రామాలలో కూడా ఇలాంటి తంతు జరుగుతుం దని గ్రామస్తులు తెలుపుతున్నారు.

ఇటీవల తుంగతుర్తి మండలంలో ఉపాధి కూలీలపై అవకతవకలు పాల్పడ్డ ఫీల్ అసిస్టెంట్ ను విధుల నుండి తొలగించిన విషయం మరువకముందే గడ్డిపల్లి లాంటి ఘటనలు పున రావృతం అవ్వడం ఉపాధి హామీ సిబ్బందికి అధికారులు,ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనేదానికి నిదర్శ నం. నిజంగా కష్టపడిన కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు గుర్తించి పనికి రాకుండా డబ్బులు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

నిజమైన కూలీలకు న్యాయం చేయాలి

‘గ్రామంలో పనికి వెళ్ళిన నిజమైన కూలీలకు రెండు మూడు రోజులకు పైసలు వస్తే వ్యాపారులకు విదేశాల్లో ఉన్నవారికి ఏడు రోజుల పైసలు వచ్చినాయి.100 మందికి పైగా పనిచేయని వారికి డబ్బులు పడ్డాయి.నిజమైన కూలీలకు తీరని అన్యాయం జరుగుతుంది.ఇప్పటికైన అధికారులు నిజమైన కూలీలకు న్యాయం చేయాలి‘

గులాం, ఉపసర్పంచ్, గడ్డిపల్లి