28 May, 2026 | 2:36 AM

రూ.1.22 కోట్ల హవాలా నగదు స్వాధీనం

28-05-2026 01:27 AM

సికింద్రాబాద్, మే27 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు, రైల్వే రక్షణ దళం సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ హవాలా నగదు పట్టుబడింది. ముంబై నుంచి హైదరాబాద్కు దేవగిరి ఎక్స్ప్రెస్(ట్రైన్ నం.17057) ద్వారా తరలిస్తున్న రూ.1,22,70,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మే 26న బొల్లారం మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానా స్పదంగా లగేజీ బ్యాగ్ తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లాకు చెందిన విజయ్ అంబాదాస్ గుప్తా (40)గా గుర్తించారు.పోలీసుల విచారణలో, ముంబై లో కాంతా జువెలరీ నిర్వహిస్తున్న ‘సంతోష్ సేథ్’ నుంచి రూ.1.22 కోట్ల నగదును తీసుకుని, సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జువెలరీ వ్యాపారం చేస్తున్నట్లు చెప్పబడుతున్న‘బంటి’కి అప్పగించేందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించాడు.

ఈ నగదు తరలింపుకు తనకు రూ.5 వేల పారితోషికం ఇస్తామని చెప్పినట్లు తెలిపాడు. అయితే నగదు మూలం, యాజమాన్యం, వినియోగంపై ఎలాంటి సరైన పత్రాలు చూపించలేకపోవడంతో, హవాలా లావాదేవీలకు సంబంధించి నదిగా భావించి అధికారులు నగదును స్వాధీ నం చేసుకున్నారు.నిందితుడి మొబైల్ ఫోన్, గుర్తింపు కార్డులు,ప్రయాణ టికెట్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.