రైతు సమస్యలపై రాజకీయాలొద్దు
రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకొని ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోందన్నారు. ఈ సమయంలో రైతులకు బాసటగా నిలబడాల్సిన నాయకులు వారిని మానసికంగా దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు.
బుధవారం రైతు కమిషన్ కార్యాలయంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డిలతో కలిసి కోదండరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, మద్దతు ధరల వ్యవస్థలో ఉన్న 23 పంటల కొనుగోళ్ల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో ధాన్యం సేకరణ జరుగుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనుగోలు వ్యవస్థలు బలహీనపడ్డాయని, 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా పెట్టుకోగా, 57 లక్షల 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. 2014 తరువాత బీజేపీ, బీఆర్‌ఎస్ హయాంలో రైతు సమస్యలు పెరిగాయని కోదండరెడ్డి ఆరోపించారు.






