మందుబాబుల అడ్డాగా గద్వాల బస్టాండ్!?
* భయాందోళనలో ప్రయాణికులు
* ప్రత్యేక నిగా ఏర్పాటు చేయాలని డిమాండ్
గద్వాల టౌన్, మే 13 : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్ ఆవరణలో బహిరంగంగా మద్యం సేవించే ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు స్థానికులు తెలిపారు. బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటి పర్యవేక్షణ సమర్థంగా లేకపోవడం, భద్రతా సిబ్బంది తగినంతగా లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయని ఆరోపిస్తున్నారు. బస్సులు నిలిపే ప్రదేశాల వద్దే కొందరు మద్యం సేవించి ఖాళీ సీసాలను అక్కడే పడేసి వెళ్లిపోతుండటంతో బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో పోలీసు పహారా పెంచడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ డీఎంను చరవాణి ద్వారా సంప్రదించగా, ఈ విషయం మా దృష్టికి రాలేదు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాం అని స్పందించారు.






