ఘనంగా మార్కండేయస్వామి పల్లకీ సేవ
మద్దూర్, ఆగస్టు 28 :ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి సందర్భంగా మద్దూరు పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడంతో పాటు పద్మశాలీ కులబాంధవులు గాయత్రీ ధారణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. అనంతరం ఆలయం నుంచి మార్కండేయ స్వామివారి పల్లకి సేవను ఘనంగా ప్రారంభించారు.
పల్లకి సేవ మద్దూరు పట్టణంలోని ప్రధాన పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో కొనసాగింది. మార్గమధ్యంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, భక్తి గీతాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మద్దూరు పద్మశాలీ సంఘం సభ్యులు, పద్మశాలీ కుటుంబాల సభ్యులు, భక్తులు, పురప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






