5 August, 2026 | 1:55 AM

ఘనంగా నార్ల మాట పుస్తకావిష్కరణ

05-08-2026 12:00 AM

ఖైరతాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యవంలో ఐఐఎంసీ కళాశాల ముద్రించిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ సంకలన పరిచిన ‘నార్ల మాట’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఐఐఎంసీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు ఇ.రామకృష్ణ పుస్తకావిష్కరణ సభను ప్రారంభిస్తూ ఆధునిక తెలుగు సాహిత్యంలో, పత్రికా సాహిత్యంలో నార్ల వేంకటేశ్వరరావు చేసిన సేవలు, విశేషమైన కృషి చేసిన గుర్తు చేసుకున్నారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తెలుగు భాషను మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తూ తెలుగు భాష ఉన్నత్యాన్ని చాటాలని తెలియజేశారు.

ఐఐఎంసీ కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లాడుతూ మరుగున పడుతున్న సాహితీవేత్తలు, ప్రముఖ వ్యక్తుల పుస్తకాలను, అదేవిధంగా ఎంతోమంది సాహితీ ప్రముఖుల విలువైన సమాచారాన్ని సమాజానికి అందజేయాలనే ఉద్దేశంతో  పుస్తక ప్రచురణను ప్రారంభించామని, ఏ కళాశాల తీసుకోని సాహసోపేతం నిర్ణయాన్ని మేము తీసుకున్నామని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకర శర్మ ‘నార్ల మాట’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం సంకలనకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ తొలి ప్రతిని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములుకు అందజేశారు. కమలాకర శర్మ మాట్లాడుతూ పత్రిక సంపాదకీయం, సమీక్షల  ప్రాధాన్యాన్ని, నార్ల వారి తెలుగు వచన గొప్పతనాన్ని తెలియజేశారు. గౌరవ అతిథిగా ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ 120 సంవత్సరాల క్రితం పుట్టిన నార్ల వారిని వారి పుస్తక సంకలనం ద్వారా స్మరించుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.

ఐఐఎంసీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ పి. పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నార్ల మాట పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కనీసం ప్రతిరోజు ఒక పేజీ అయినా చదివి తెలుగు భాషలోని పదాలను నేర్చుకుని నేటి తరానికి వాటి విలువను తెలియజేయాలని చెప్పారు. పుస్తక సమీక్షకులు, నవతెలంగాణ ఎడిటోరియల్ సభ్యులు అనంతోజు మోహనకృష్ణ నార్లమాట పుస్తకాన్ని విశ్లేషిస్తూ తెలుగు పత్రికా సంపాదకీయ పితామహునిగా చెప్పుకునే నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయం రాయడంలో వేసిన పునాది ఈనాటికి పత్రికా రంగంలోని చాలా సంపాదకీయ వ్యాసాల్లో సంపాదకులు కొనసాగిస్తున్నారని తెలియజేశారు. 

నార్ల మాట సంకలనకర్త డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ ఇంతటి విలువైన పుస్తకాన్ని ముద్రించిన ఐఐఎంసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కళాశాల చైర్మన్ ఆచార్య వంగపల్లి విశ్వనాథం, కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ అతిధులను సత్కరించారు. కార్యక్రమాన్ని సంస్కృత విభాగం సహాయచార్యులు మాధవి వందన సమర్పణతో ముగించారు.కార్యక్రమంలో కళాశాల డీన్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తెలుగు సాహిత్య విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, సాహితీ ప్రముఖులు, అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు.