5 August, 2026 | 2:44 AM

తప్పిపోయిన మహిళను గుర్తించిన పోలీసులు

05-08-2026 12:00 AM

కరీంనగర్ క్రైం, ఆగస్టు 4 (విజయ క్రాంతి): కరీంనగర్ రూరల్ మండలంలోని ఇరుకుల గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన నూతనంగా నిర్మిస్తున్న వంతెన సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ ఒంటరిగా నిలబడి ఉన్నట్లు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ నిరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. వెంటనే ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని, మహిళను భద్రంగా తమ ఆధీనంలోకి తీసుకొని విచారించారు.

విచారణలో ఆమె తన పేరు రూపా రాథోర్, తండ్రి పేరు రామ్ గోపాల్ రాథోర్, స్వగ్రామం ఖాటిమా, ఉదమ్ సింగ్ నగర్ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రం అని తెలిపింది. కుటుంబ కలహాల కారణంగా భర్తతో గొడవపడి, సుమారు వారం రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి వివిధ వాహనాల్లో ప్రయాణిస్తూ కరీంనగర్కు చేరుకున్నట్లు తెలిపింది. అనంతరం కరీంనగర్ బస్టాండ్లో ఓ బస్సు ఎక్కగా, టికెట్కు డబ్బులు లేకపోవడంతో బస్సు సిబ్బంది ఇరుకుల గ్రామ సమీపంలో దింపివేసినట్లు వివరించింది.

మహిళ తెలిపిన వివరాల ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు కరీంనగర్ రూరల్ పోలీసులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మహిళ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆమెను కరీంనగర్కు తరలించి శక్తి కేంద్రంలో సురక్షితంగా ఉంచారు. మహిళ కుటుంబ సభ్యులు, ఉత్తరాఖండ్ పోలీసులు వచ్చిన అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి వారికి అప్పగించనున్నట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎ నిరంజన్ రెడ్డి తెలిపారు.