వైభవంగా శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్ కేసర్, జూలై 9 (విజయక్రాంతి) : ఘట్కేసర్ డివిజన్ పరిధి, వేమననగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవిజయ వెంకటేశ్వరస్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాలు, పవిత్ర ధార్మిక కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన ఆలయ అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని శ్రీవిజయ వెంకటేశ్వరస్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






