20 June, 2026 | 2:55 AM

‘దేశ భవితకు దిక్సూచి రాహుల్ గాంధీ’

20-06-2026 01:49 AM

భావి భారత ప్రధానిగా చూడడమే ప్రజల ఆకాంక్ష

మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు

ఖమ్మం, జూన్ 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ భవితకు దిక్సూచి అని, ఆయనను భావి భారత ప్రధానిగా చూడడమే యావత్ దేశ ప్రజల ఆకాంక్ష అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ 56వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. తుంబూరు దయాకర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ త్వరలోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజాపక్షపాతి అయిన ఆయన నాయకత్వంలో దేశం మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, పార్టీ ముఖ్య నాయకులు మద్ది వీరారెడ్డి, వెంకట్కృష్ణ, ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్, రంజిత్ నాయక్, రవి, పీఎస్‌ఆర్ సోషల్ మీడియా వారియర్స్ ఆరెంపుల బద్రిసాయి, బొడ్డు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.