20 June, 2026 | 2:51 AM

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

20-06-2026 01:49 AM

 కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్, జూన్ 19 : మండలంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన నిర్మాణ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని గంగిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు, మూత్రశాల నిర్మాణ పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను ఎం పీ డీ ఓ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంగిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చేపట్టిన మూత్రశాల నిర్మాణాన్ని కొందరు కూల్చి వేస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వారిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులతో పాటు సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.