16 May, 2026 | 1:54 PM

దయ్యాలు వేదాలు పలికినట్టు

16-05-2026 01:14 PM

2015లో జీవో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం

డిపిఆర్ ను కేంద్ర జల సంఘానికి ఇవ్వడానికి ఏడు యేండ్లు

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ వారు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలికినట్టు ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక పంప్ హౌస్ ఆన్ చేసినా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండున్నరేళ్లలో అన్ని అనుమతులు తీసుకొచ్చిందని, రూ.7 వేల కోట్లు ఖర్చు చేస్తూ అన్ని చిక్కుముడులను విప్పి, భూసేకరణ సమస్యలను పరిష్కరిస్తోందన్నారు.

డిసెంబర్ 2027 లక్ష్యంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి నిరంతరం రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు.  భూసేకరణ కోసం రూ.6 వేల కోట్లు కేటాయించామని, బీఆర్ఎస్ నాయకులు ఉనికి కోసం పాదయాత్రలు చేస్తూ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మాటలను పాలమూరు ప్రజలు ఎన్నటికీ నమ్మరని, ఇరిగేషన్, ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మూడు పునాదులపై తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకుల కల్లబొల్లి మాటలు వారికి ఏనాడూ లాభం చేకూర్చవని పేర్కొన్నారు. 

బీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు.. మున్సిపాలిటీ ఎన్నికల్లో  బుద్ధి చెప్తారన్నారు.  రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ప్రజలు తగిన తీర్పుతో బుద్ధి చెప్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్  ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.