ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం: మంత్రి జూపల్లి
డయాలసిస్ కేంద్రానికి నిరంతర విద్యుత్ సేవలు
కొల్లాపూర్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. శనివారం కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి ప్రకటించారు. ప్రత్యేక విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంతో ఇకపై విద్యుత్ అంతరాయం లేకుండా డయాలసిస్ సేవలు కొనసాగుతాయని తెలిపారు.
ప్రభుత్వ దవాఖానాల్లోనే ఆధునిక వైద్య సేవలు, పరీక్షలు, నాణ్యమైన మందులు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిలో త్వరలోనే సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. డయాలసిస్ కేంద్రంలో అదనపు బెడ్లు, ఏసీల ఏర్పాటు చేయడంతో పాటు రోగుల కోసం మరో అంబులెన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. 2018లో రూ.22 కోట్ల వ్యయంతో మంజూరైన 100 పడకల నూతన ఆసుపత్రి భవన పనులు పూర్తయ్యాయని, త్వరలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి వద్ద రూ.5 లక్షల వ్యయంతో నూతన బస్ షెల్టర్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని నిరంతరం పర్యవేక్షిస్తూ రోగులకు అండగా ఉండాలని సూచించారు.






