18 August, 2026 | 3:35 AM

గ్రహపాటు

18-08-2026 01:53 AM

మీ తప్పులకు ప్రభుత్వ అధికారులు బలికావాలా?  

సర్కార్ నడుపుతున్నవా..  లేక సర్కస్ నడుపుతున్నవా రేవంత్‌రెడ్డి?  

  1. మంత్రులు సారీ చెబితే  సరిపోదు 
  2. సీఎం ఇల్లు కూడా 22 ఏ నిషేధిత జాబితాలోనే.. 
  3. రెవెన్యూ శాఖలో ఏ పనికైనా 30% కమీషన్ 
  4. కళ్యాణలక్ష్మి పథకాన్ని కావాలనే నీరుగార్చారు 
  5. మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : 22 ఏ నిషేధిత భూముల విషయంలో భూదందా వెలుగులోకి రావడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ‘సారీ’ అంటూ తప్పించుకుని, అధికారులపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని  మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో 22 ఏ సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురిచేస్తోందని విమర్శించారు.

ఎవరి భూమి 22 ఏ లో ఉందో, ఎవరిది లేదో తెలియక రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో సర్కార్ నడుపుతున్నవా.. లేక సర్కస్ నడుపుతున్నవా రేవంత్‌రెడ్డి’ అని మీ తప్పులకు ప్రభుత్వ అధికారులు బలి కావాలా?, తప్పు మీరు చేస్తే శిక్ష వారు అనుభవించాలా? అని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను బంద్ చేయాలనే కుట్ర బయటపడటంతో ఆ తప్పును అధికారులపైకి నెట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న అంశాల్లో సరిదిద్దుకోలేని తప్పు చేసి, ‘సారీ’ చెప్పి తప్పించుకుంటే సరిపోదు అని హెచ్చరించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఇక రావేమోనని పేదలు ఆందోళన చెందుతున్నారని, 22 ఏ నిషేధిత భూముల వ్యవహారంతో ఎంతోమంది మానసిక వేదనకు గురయ్యారని సోమవారం ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులపై మీరు చర్యలు తీసుకోవడం  కాదు.. మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వ వైఫల్యంపై ముందు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ అధికారులపై మీరు సీరియస్‌గా ఉండటం కాదు.. తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వంపై సీరియస్‌గా ఉన్నారని, కర్రు కాల్చి వాత పెట్టేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు. మీరు ఎన్నిసార్లు సారీ చెప్పినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, కళ్యాణలక్ష్మి పథకం ఆగకూడదు.. రాష్ట్రవ్యాప్తంగా నిషేధిత జాబితా నుంచి భూహక్కుదారుల భూములను తొలగించి, వారికి పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 

30 శాతం కమీషన్ లేనిదే ఏ పని కాదు... 

 దేశవ్యాప్తంగా 1999లోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని రద్దు చేశారని, మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ చట్టాన్ని పూర్తిగా ఎత్తేశారని గుర్తు చేశారు. కానీ ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి, క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ తీసుకొచ్చి సీలింగ్ యాక్ట్ కింద 22 ఏలో పెట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు.  తెలంగాణ భవన్‌లో హరీష్ రావు చిట్ చాట్ చేసారు.

ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనమని, ఏకంగా ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రభుత్వ భూములను కూడా 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టారంటే ఈ అధికారుల పనితీరు ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్‌లో చేర్చారని, శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాప ర్టీలను కూడా ఇప్పుడు 22 ఏలో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.

30 ఏళ్ల క్రితం కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పెడితే ఆ ప్రజలు ఇప్పు డు ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. 22ఏ జాబితా భూముల పేరిట రిజిస్ట్రేషన్ కోసం కట్టిన చలాన్ డబ్బులు కూడా వాపస్ ఇవ్వకుండా ప్రభుత్వం ప్రజల సొమ్మును నిలు వునా దోచుకుంటోందన్నారు. లోన్‌లు మం జూరైన భూములను కూడా 22 ఏలో పెట్టడంతో ఇటు ప్రజలు, అటు బ్యాంకులు ఆగమవుతున్నారని తెలిపారు.

22 ఏ నుంచి భూమిని బయటకు తీయాలన్నా 30 శాతం కమీషన్ లేనిదే రెవెన్యూ శాఖలో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదన్నారు. చివరకి సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22ఏ ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తన సొంత ఇంటికి సెగ తగిలే సరికి ప్రభుత్వంలో హడావిడి మొదలైందన్నారు. మీకు చురుకు తగిలితేనే కానీ సామాన్యుల బాధలు పట్టవా అని నిలదీశారు. స్వయంగా సీఎం పరిస్థితే ఇలా ఉంటే, ఇక రాష్ట్రంలో సామాన్య ట్రజల పరిస్థితి ఏంటి? వాళ్ల గోడు ఎవరు వినాలని ప్రశ్నించారు.

అసలు ఈ ప్రాపర్టీలను 22 ఏలో ఎవరు పెట్టారు? కమీషన్లు తీసుకుని ఎవరు తొలగిస్తున్నారు? అనే దానిపై తక్షణమే విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డిసెంబర్  7,  2023 నుంచి భూములను ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టిన వివరాలు ప్రభుత్వం వెంటనే వైట్ పేపర్ విడుదల చేసి నిజాలను ప్రజల ముందు ఉంచాలని, అప్పటిలోగా ఈ ఆస్తులన్నింటినీ 22ఏ పరిధి నుంచి మినహా యించాలన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ చేసిన పోరాటంతోనే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయని తెలిపారు. కేవలం సమావేశాలు వాయిదా పడితే సరిపోదు.. ఎజెండా నుంచి తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అం శాన్ని కచ్చితంగా తొలగించాల్సిందే అని డిమాండ్ చేశారు. 

కళ్యాణలక్ష్మి కేసు వాదించేందుకు లాయర్ దొరకలేదా... 

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తెచ్చిన కల్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో, ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి ఖతం చేసిందని, కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశామని డ్రామాలు ఆడుతున్నారు.. కానీ కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని పాతాళంలో బొంద పెట్టారని మండిపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ 16 లక్షల లెక్కలు చెబుతున్నారని తెలిపారు.

జనాభా పెరిగినప్పుడు సహజంగానే పెళ్లిళ్ల సంఖ్య, దరఖాస్తులు పెరగాలని, కానీ కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో(2012-22) 2,31,371 పెళ్లిళ్లకు ఒక్క ఏడాదే ఆర్థిక సాయం అందించామని, కానీ కాంగ్రెస్ వచ్చాక 2024- -25లో కేవలం 1 లక్షా 58 వేల పెళ్లిళ్లకు మాత్రమే సాయం చేశారని వివరించారు.

ఇక 2025--26 సంవత్సరంలో కేవ లం 86 వేల పెళ్లిళ్లకు మాత్రమే రూ. 870 కోట్లు ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారని, పథకాన్ని ఎలా నీరుగార్చారో చెప్పడా నికి ఈ లెక్కలే సాక్ష్యమన్నారు. కోర్టులో 30 రోజులు కౌంటర్ వేయకపోవడంతోనే స్టే వచ్చిందని, దీన్నిబట్టే సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతోందన్నారు. సింగిల్ జడ్జి స్టే ఇచ్చిన వెంటనే డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ పోరాటం దెబ్బకు భయపడి ఇప్పుడు హడావిడిగా అప్పీల్‌కు పోతామని కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని, బీఆర్‌ఎస్ ఒత్తిడి లేకపోతే ఈ పథకాన్ని ఎప్పుడో శాశ్వతంగా సమాధి చేసేవాళ్లు అని ఎద్దేవా చేశారు. నా మీద రాజకీయ కక్ష సాధింపు కోసం, తప్పుడు కేసులు పెట్టి వాదించడానికి సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను ప్రత్యేకంగా తెచ్చుకున్నారని, ఆయనకు రోజుకు రూ. 50 లక్షల ఫీజు చెల్లించడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు రోజుకు 50 లక్షలు కట్టే ప్రభుత్వానికి.. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆడబిడ్డల భవిష్యత్తు ముడిపడి ఉన్న కల్యాణ లక్ష్మి కేసును వాదించడానికి ఒక మంచి లాయర్ దొరకలేదా, లేక కావాలనే లాయర్‌ను పెట్టలేదా నిలదీశారు.

కేసీఆర్ మొదటి కేబినెట్‌లో 42 సంక్షేమ పథకాలను ఆమోదిస్తే, రేవంత్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తివేయా లా అని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పెళ్లిళ్లు జరిగి పిల్లలు పుడుతున్నా పైసలు రావడం లేదని, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ‘కల్యాణలక్ష్మి’ కాస్తా ‘సంతాన లక్ష్మి’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ఫోర్ బ్రదర్స్ పాలన.. 

కొత్త రేషన్ కార్డులు బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఇస్తుందని నాడు స్వయంగా ఇప్పటి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే ట్వీట్ చేశారని, కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇవ్వకపోగా..  లక్షా 40 వేల రేషన్ కార్డులను దారుణంగా తొలగించి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. ఉద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, గత మూడు నెలలుగా జీతాల నుంచి ఈహెచ్‌ఎస్ డబ్బులు కట్ చేస్తున్నారు కానీ.. ఆ కార్డు పట్టుకుంటే ఏ ఆసుపత్రిలో ట్రీట్మెం ట్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేకుండానే జర్నలిస్టులను సైతం ఈహెచ్‌ఎస్‌లో చేర్చిందని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన అంటే కుటుం బ పాలన.. ఫోర్ బ్రదర్స్ పాలనగా మారిపోయిందని, ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సొంత మనుషులకు మాత్రమే జస్టిస్ జరుగుతోందని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోతే, రేవంత్ రెడ్డి ఇవాళ యనమల రామకృష్ణుడు కాళ్లకాడో కూర్చునేవాడని ఎద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వం చేస్తున్న స్కాములను నేను ఆధారాలతో సహా బయటపెడుతుంటే.. సమాధానం చెప్పలేక నా మీద రేవంత్ రెడ్డి వ్యక్తిగత టార్గెట్ పెట్టుకున్నారని, తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని విమర్శించారు. అసలు రేవంత్ రెడ్డి కథ ఏంటో, ఆయన చరిత్ర ఏంటో గతంలో స్వయంగా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే చెప్పారన్నారు.

నేను నిజంగా అలాంటి పూజలు చేసినట్లు సీఎం దగ్గర ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని సవాల్ చేశారు. సీఎంకు నిజంగా దమ్ముంటే నా పేరు చెప్పి ఈ ఆరోపణలు చేయాలని, కానీ లీగల్ నోటీసులకు, చట్టానికి భయపడే ఆయన నా పేరు చెప్పకుండా పరోక్షంగా పిరికివాడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నన్ను అగ్గిపెట్టెతో పోలుస్తూ చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి.. అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదన్నారు.

నా మీద 370 కేసులు ఉన్నాయని, మెదక్ జైల్లో మూడు రోజులు ఉన్న, రైలు రోకలో 48 గంటలు కంకర రాళ్ల మీదే పడుకున్నానని గుర్తు చేశారు. మిలియన్ మార్చ్ సమయంలో నాకు ఈత రాకపోయినా తెలంగాణ కోసం హుస్సేన్ సాగర్ లోకి దూకానని, మానుకోటలో బుల్లెట్లు పడుతుంటే.. రక్తపు మడుగులో ఉన్నవారిని నా భుజాలపై ఎత్తుకుని ఆసుపత్రికి పరుగెత్తానని తెలిపారు. నాపై పోటీ చేసిన ప్రత్యర్థులకు ఏడుసార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర నాది.. నా గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు.