బాధిత కుటుంబాలకు అండగా ప్రభుత్వం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, జూలై 10 (విజయక్రాంతి): విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ముగ్గురు అభ్యర్థులకు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి శుక్రవారం హుజూర్ నగర్ లో నియామక పత్రాలు అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ ఉద్యోగాల ద్వారా భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఉద్యోగ అవకాశం కల్పించినందుకు లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






