6 June, 2026 | 3:05 AM

ఎబోలా వైరస్‌తో సర్కార్ ఎలర్ట్

06-06-2026 01:36 AM
  1. అపోలో నుంచి మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రికి తరలింపు
  2. ఒకే ఫ్లైట్‌లో వచ్చిన ముగ్గురు అనుమానితులు 
  3. సూడాన్ నుంచి వ్యక్తికి నెగెటివ్

సికింద్రాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిన సుడాన్ నుంచి వ్యక్తికి ఎబోలా నెగెటివ్‌గా తేలింది. ఈ మేరకు పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) నిర్థారించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా వైరస్ లక్షణాలతో మరో ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అక్కడ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుల సంఖ్య ముగ్గురికి చేరింది. సమాచారం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లగా, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానించారు.

అనంతరం వారిని ప్రత్యేక నిఘా, చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గురువారం కూడా ఇదే తరహా లక్షణాలతో మరో వ్యక్తిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణలో ముగ్గురు అనుమానితులు కూడా విదేశాల నుంచి ఒకే విమానంలో హైదరాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు.సూడాన్ నుంచి వచ్చిన 3౫ ఏళ్ల యువకుడికి  ఎబోలా లక్షణాలు ఉండడంతో ఆ విమానంలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.అవసరమైతే వారిని కూడా వైద్య పరీక్షలకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురు బాధితులను ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు..