పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
16వ అదనపు జిల్లా జడ్జి ఎస్. స్వాతి రెడ్డి
షాద్నగర్, జూన్ 5 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని 16వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్. స్వాతి రెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం షాద్నగర్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో అటవీ శాఖ అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటంలో చెట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెద్ద చెట్లుగా ఎదిగే వరకు బాధ్యతగా చూసుకోవాలని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రకృతిని కాపాడటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కొత్త రవి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సాహితీ, సెకండ్ క్లాస్ జడ్జి ప్రవీణ్ కుమార్, అటవీ శాఖ అధికారి మహమ్మద్ అజీజ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులు సబియా సుల్తానా, న్యాయవాదులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






