24 August, 2026 | 3:56 AM

కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

24-08-2026 02:28 AM

హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న 

మహబూబాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు.

మహబూబాబాద్ టౌన్ హమాలి సంఘం సమావేశం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బానోతు రవి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు, ఉచిత వైద్యం, ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే 25 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి 6,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇండ్లు లేని కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, ఈఎస్‌ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసే హమాలీలకు నాలుగో తరగతి ఉద్యోగాలు గుర్తించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సంక్షేమ, హక్కుల సాధన కోసం అనేక పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పట్టించుకోవడంలేదని, సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో వివిధ మండలాల నుండి అనేక మంది కార్మికులు పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన పోరా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హేమ, బాలు, మహేందర్, సతీష్, ఐలయ్య, రాము, వెంకన్న, హరినాయక్, చారి, ఐలయ్య, లక్ష్మణ్, లాలు, మల్లేష్ తదితరులున్నారు.