కేటీపీఎస్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలి
లేదంటే బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం*
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కేటీపీఎస్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేంద్రరావు హెచ్చరించారు. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ కేటీపీఎస్ ఆర్టిజన్ ఉద్యోగులు గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగులు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత కొద్ది రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం, జన్కో అధికారులు పట్టించుకోవట్లేదని, ప్రభుత్వంలో భాగమైనటువంటి ఆర్టీజెన్స్ ను పట్టించుకోకపోవడం సమస్యలు పరిష్కరించకుండా విధుల్లోకి చేరాలని నోటీసులు జారీ చేయడం బాధాకరమన్నారు, పాల్వంచ గడ్డ పోరాటాల గడ్డ అని గుర్తు చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ప్రభుత్వం కెసిఆర్ నాయకత్వంలోనే కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టిజన్ ఉద్యోగులుగా గుర్తింపుచ్చిందని గుర్తు చేశారు. అనంతరం ఆర్టిజన్ కార్మికుల సమ్మె ప్రాంగణ స్థలం వద్ద మంచినీరు వంటి సదుపాయాల సహాయార్థం పదివేల రూపాయలు సహాయం అందించారు.




