21 June, 2026 | 5:21 AM

రైతులకు తీపికబురు

21-06-2026 12:03 AM
  1. పీఎం కిసాన్ నిధుల విడుదల
  2. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది ఖాతాల్లో 18,880 కోట్లు జమ 

న్యూఢిల్లీ, జూన్ 20: రైతులకు తీపికబురందింది. పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. శనివారం పశ్చిమ బెంగాల్ హుగ్లీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదికగా పీఎం కిసాన్ 23వ విడత నిధులను 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లో డిజిటల్ మాధ్యమంగా రూ. 18,880 కోట్లను జమచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బెంగాల్ సంకెళ్ల నుంచి విముక్తి పొందిందన్నారు. ఇక కొత్త పరిమళం వెదజల్లుతుందన్నారు. బెంగాల్‌లో ప్రాజెక్టుల ప్రారంభాలు నూతన భవిష్యత్‌కు నిదర్శనమన్నారు. అనంతరం ఒడిశాలోని మయూర్‌గంజ్ జిల్లా పర్యటనకు వెళ్లి రూ. 47వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముర్ము 68వ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో తూర్పు భారత్‌ను తీవ్ర నిర్లక్ష్యం చేసింది. తమ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో వేగంగా పురోగమిస్తుందన్నారు. ఒప్పటికే ఒడిశాకు 20 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని చెప్పారు. విద్యుత్, కోల్ గ్యాసిఫికేషన్, ఎన్‌హెచ్ 353 రహదారి, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.