20 March, 2026 | 11:40 AM

గిరిజనులను ప్రోత్సహించేందుకే గిరి మార్ట్

20-03-2026 12:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మార్చి 19, (విజయక్రాంతి): గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే గిరి మార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ITౄA), ఆదివాసీ కమ్యూనిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వారా సేకరించిన , ముందుగా తయారు చేసిన ఉత్పత్తులకు, సాంప్రదాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఉమ్మడి వేదికను అందించడానికి ప్రస్తుత గిరి బజార్ను ’భద్రగిరి మార్ట్’గా అప్గ్రేడ్ చేస్తోందన్నారు. భద్రగిరి మార్ట్  15 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయబడుతోంన్నారు.

2026 మార్చి 27న శ్రీరామనవమి రోజున దీన్ని ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మన్ కి బాత్ ప్రసంగంలో ప్రస్తావించారు. మిల్లెట్ బిస్కెట్లతో పాటు, గిరిజన మహిళలు మహువా (ఇప్ప పువ్వు)తో తయారు చేసిన లడ్డూ, ఇప్పపువ్వు బర్ఫీ, టీ పొడి, కరక్కాయ పౌడర్, కరక్కాయ లకు కూడా మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు.

అటవీ ఉత్పత్తులైన తేనె, సబ్బులు, షాంపోలు,(కుంకుడు కాయలు)  ఆదివాసీలు సేకరించిన అటవీ ఫలాలు, పండ్లు, గిరిజన రైతులు పండించే ఆర్గానిక్ తృణ ధాన్యాలు, వివిధ రకాలైన పప్పు దినుసులతో పాటు నిత్యవసర సరుకులు భద్రగిరి మార్ట్లో విక్రయించబడతాయన్నారు. గిరిజన స్వయం సహాయక మహిళలు తయారు చేయబడిన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయనీ,ఏజెన్సీ ప్రాంతాలలోనీ గిరిజన మహిళలు తమ ఉత్పత్తులను అవుట్లెట్కు సరఫరా చేస్తాయన్నారు. ఆదివాసీ రైతులు పండించిన అరుదైన పప్పులు, వరి, బియ్యం, ఇతర ముడి సరుకులు కూడా మార్ట్లో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ..

అటవీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో ఆదివాసీ కుటుంబాలు మధ్య దళారులను నివారించేందుకు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి స్వయం సహాయక బృందాలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక వేదికను రూపొందించేందుకు ఈ భద్రగిరి మార్ట్ దోహదపడుతుందన్నారు. సుమారు 100 గిరిజన కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందటంతో పాటు పదిమంది గిరిజన కుటుంబాలకు భద్రగిరి మార్ట్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు.  ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే వారపు గిరిజన మార్కెట్ల(సంతలు) వాతావరణాన్ని పునః సృష్టించేందుకు ఈ సదుపాయాన్ని రూపొందిస్తున్నామన్నారు.