7 April, 2026 | 2:18 AM

కొందుర్గులో గ్యాస్ కష్టాలు

07-04-2026 12:25 AM
  1. చుక్కలు చూపిస్తున్న సిలిండర్ వెయిటింగ్
  2. మూడు గంటలు ఆగితేనే ఒక సిలిండర్.. 300 అడుగుల మేర భారీ క్యూలైన్లు..!

కొందుర్గు, ఏప్రిల్ 6(విజయక్రాంతి) పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందనే ప్రచారం షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద నెలకొన్న దృశ్యాలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అద్దం పడుతున్నాయి.

అర్ధరాత్రి నుంచే పడిగాపులు...

గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదో అన్న ఆందోళనతో వినియోగదారులు తెల్లవారుజాము నుంచే ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కొందుర్గు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద సుమారు 300 అడుగుల మేర భారీ క్యూలైన్ కనిపించడం గమనార్హం. ఒక్కో సిలిండర్ డెలివరీ కావడానికి కనీసం 3 గంటల సమయం పడుతుండటంతో వినియోగదారుల సహనం పరీక్షించబడుతోంది.

కూలీ పనులు మానుకొని క్యూలోకి

రోజువారీ పనులు చేసుకుంటేనే పూట గడిచే సామాన్యులు, నేడు పనులు మానుకొని సిలిండర్ కోసం గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.చంటి పిల్లలతో మహిళలు, నీరసించిన వృద్ధులు, దివ్యాంగులు సైతం మండుతున్న ఎండలో క్యూలైన్లలో ఉండలేక అల్లాడిపోతున్నారు.

టోకెన్లు ఉన్నా.. గ్యాస్ లేదాయే..

ఏజెన్సీ ప్రతినిధులు టోకెన్లు పంపిణీ చేస్తున్నప్పటికీ, స్టాక్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరు గుతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నా, ఇక్కడ మా పరిస్థితి వేరేలా ఉంది. గంటల తరబడి ఎండలో నిలబడలేకపోతున్నాం. అధికారులు తక్షణమే స్పంది ంచి సరఫరాను వేగవంతం చేయాలని స్థానిక వినియోగదారులు కోరుతున్నారు.

అధికార ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతన ఏది?

ఒకవైపు ప్రభుత్వం రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని, సరఫరా సజావుగానే సాగుతోందని ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ, కొందుర్గు మండలంలో కనిపిస్తున్న పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. డిమాండ్కు సరిపడా సిలిండర్లు రాకపోవడం, సరఫరా వ్యవస్థలో లోపాలే ఈ ఇబ్బందులకు ప్రధాన కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని సరఫరాను పునరుద్ధరించాలని, క్యూలైన్ల వద్ద కనీస సౌకర్యాలు కల్పించి, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.