25 June, 2026 | 2:31 AM

చెత్త సేకరణ ముసుగులో మహిళల దొంగల ముఠా

25-06-2026 01:18 AM

ముత్తారంలో వెలుగులోకి, భయాందోళనలో గ్రామస్తులు 

పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు 

ముత్తారం, జూన్ 24 (విజయక్రాంతి): చెత్త సేకరణ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ, ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని చూసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా వ్యవ హారం స్థానికంగా కలకలం రేపుతోంది. అమాయక ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ దొంగతనాలతో గ్రామాల్లోని మహిళలు, వృద్ధులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల ముత్తారంలో జరిగిన ఘటనతో వెలుగులోకిగత శనివారం ముత్తారం మండల కేంద్రంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి ప్రయత్నించిన నలుగురు మహిళలను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. జమ్మికుంట ప్రాంతానికి చెందిన ఈ మహిళలపై గతంలో కేసులు ఉన్నట్లు ఎస్త్స్ర రవికుమార్ ధృవీకరించారు.

ప్రజల ఆందోళన

పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, వారిని అరెస్టు చూపకుండా వదిలేయడం లేదా కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ముఠా మళ్లీ గ్రామాల్లో యథేచ్ఛగా తిరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షణ లోపించడం వల్ల, ఇదే ముఠా మళ్లీ వచ్చి దొంగతనాలకు పాల్పడుతుందేమోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

పోలీస్ అధికారులకు ప్రజల విజ్ఞప్తి

ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, గ్రామాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని, ఇటువంటి దొంగల ముఠాలపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో ఉన్న భయం తొలగుతుందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.