24 June, 2026 | 6:46 PM

అనాధగా మారిన గజ్వేల్

24-06-2026 05:27 PM

- అవినీతిపై అన్ని పార్టీలూ మౌనం

- ప్రజలు అక్రమాలను నిలదీయాలని సీపీఐ నేత బట్టు దయానంద రెడ్డి పిలుపు

గజ్వేల్, జూన్ 24: గజ్వేల్ పట్టణం ప్రస్తుతం రాజకీయంగా అనాధగా మారిందని, అధికారంలో ఉన్న అన్ని పార్టీల నాయకత్వాలు అవినీతి ఆరోపణలపై మౌనం పాటించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని సీపీఐ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ కార్యదర్శి బట్టు దయానంద రెడ్డి విమర్శించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కంటే అవినీతి పెరుగుతుందనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో గజ్వేల్‌లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై కథనాలు వచ్చినప్పటికీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాటిని ఖండించక పోవడం గమనార్హమని పేర్కొన్నారు.

ఇటీవల ఆర్ అండ్ ఆర్ కాలనీ, పల్లెపహాడ్ గ్రామంలో జరిగిన ఇంటి కూల్చివేత ఘటనను ప్రస్తావిస్తూ, మాజీ జెడ్పీటీసీ రాములు చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బాధ్యతగల నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ఒక కౌన్సిలర్ డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై కూడా స్పష్టత రావాల్సి ఉందన్నారు.

మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ పాత్రలపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, స్థానిక సంస్థల్లో ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. గజ్వేల్‌లో యువత, మహిళలు, సాధారణ ప్రజలు అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ భూములు, రోడ్డు స్థలాలు, చెరువులు మరియు ఇతర ప్రజా ఆస్తుల ఆక్రమణలకు పాల్పడే వారిని ప్రజలు ఎప్పటికప్పుడు నిలదీయాలని ఆయన కోరారు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దయానంద రెడ్డి సూచించారు.