24 June, 2026 | 6:47 PM

శిథిల మార్కెట్‌కు గుడ్‌బై.. రూ.8 కోట్లతో సరికొత్త వెజ్ మార్కెట్ ప్రారంభం

24-06-2026 05:28 PM

ఇల్లందు, జూన్ 24 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణ అభివృద్ధిలో మరో మైలురాయిగా రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన మోడల్ వెజిటబుల్ మార్కెట్‌ను బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ ప్రారంభించారు. ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న పాత బ్రిటిష్ కాలం నాటి కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రజలు, వ్యాపారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదే ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ మార్కెట్‌ను నిర్మించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషితో రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయడంతో ఈ ప్రాజెక్టు పూర్తయిందని స్థానికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర పాల్గొని మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో నిరంతరం కృషి జరుగుతోందన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ మార్కెట్ ద్వారా వ్యాపారులకు మెరుగైన వాణిజ్య వాతావరణం, వినియోగదారులకు పరిశుభ్రమైన కొనుగోలు సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పెండ్యాల రాజు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో ఇల్లందులో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఈ మార్కెట్ ప్రారంభం వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూరగాయల మార్కెట్ కమిటీ ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.