ఉచిత కంటి వైద్య శిబిరాలతో వెలుగులు
మొబైల్ ల్యాబ్‌తో ప్రజల వద్దకే వైద్య పరీక్షలు
- మునుగోడు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయక్రాంతి): నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి పేరుతో స్థాపించిన కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా సొంత ఖర్చుతో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వేలాది మందికి కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయిస్తున్నారు.
ఇప్పటివరకు నిర్వహించిన 12 ఉచిత కంటి వైద్య శిబిరాలలో 9034 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 1970 మందికి విజయవంతంగా కంటి ఆపరేషన్లు చేశారు. కంటిచూపు సమస్యలతో తమ పనులు కూడా చేసుకోలేని వృద్ధులు, మహిళలకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా వారి కళ్లలో కొత్త వెలుగులు నింపుతున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మొబైల్ ల్యాబ్‌తో మరో ముందడుగు
శిబిరాలకు వచ్చే కొంతమందికి ఇతర అనారోగ్య సమస్యల కారణంగా వెంటనే కంటి ఆపరేషన్లు చేయలేని పరిస్థితులు ఉన్నాయని వైద్యులు సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకున్నారు.ఇకపై ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల వద్ద మొబైల్ ల్యాబ్ కమ్ ఆసుపత్రి ద్వారా ఇతర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఇందులో రక్త పరీక్షలు సహా పలు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందులు, వైద్యుల సలహాలు కూడా అందించనున్నారు. దీంతో ఇప్పటివరకు కేవలం కంటి పరీక్షలకు మాత్రమే పరిమితమైన ఈ శిబిరాలు ఇకపై సమగ్ర ఆరోగ్య పరీక్షల కేంద్రాలుగా మారనున్నాయి.
నేడు 13వ విడత కంటి వైద్య శిబిరం
మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల ప్రజలకు ఇప్పటికే ఒకసారి నాంపల్లి మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 1028 మందికి పరీక్షలు చేసి, వారిలో 229 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేశారు.మరోసారి నాంపల్లి మండల ప్రజల కోసం మునుగోడు క్యాంపు కార్యాలయం ఆవరణలో నేడు 13వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరం నుంచే మొబైల్ ల్యాబ్ కమ్ ఆసుపత్రి సేవలను కూడా ప్రారంభించనున్నారు.
శంకర కంటి ఆసుపత్రి, ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని నిరుపేదలు అనారోగ్యంతో బాధపడకుండా ఉండాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆకాంక్షించారు.వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని, కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే భావనతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.




