రామప్పలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ
వెంకటాపూర్, మే 25 (విజయక్రాంతి): మండలంలోని ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయం వద్ద సరస్వతి పుష్కర భక్తులకు సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఇమ్మడి భాస్కర్ ప్రారంభించారు. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తున్న భక్తులకు విజయవాడకు చెందిన కోనేటి ఏడుకొండలు-దుర్గ శ్రీలక్ష్మి దంపతులు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఈవో ఇమ్మడి భాస్కర్ మాట్లాడుతూ.. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మన్నారు. పుష్కరాల సందర్భంగా రామప్పకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్, ఆలయ సిబ్బంది సంతోష్, దామోదర్, రత్న కుమారి, టూరిస్ట్ గైడ్ విజయ్ కుమార్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, అరుణ్, పురావస్తు శాఖ మరియు గార్డెన్ సిబ్బంది పాల్గొన్నారు.






