17 July, 2026 | 1:45 AM

రాజోళిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా..!

17-07-2026 01:45 AM

చెరబట్టిన తుంగభద్ర నది.. రాత్రి వేళల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా!

చోద్యం చూస్తున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు 

అలంపూర్ జూలై 16: జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి పరిసరాల్లో తుంగభద్ర నది నుంచి అక్రమంగా ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళలను ఆసరాగా చేసుకుని నది పరివాహక ప్రాంతాల్లో భారీగా ఇసుకను తవ్వి, ముందుగానే డంపులు చేసి, అనంతరం పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇంత జరుగుతున్న మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు ఈ అక్రమ రవాణాపై కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక మాఫియా నిర్భయంగా వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత శాఖలు సమర్థవంతమైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వానికి ఆదాయ నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

నూతన ఎస్‌ఐ నిలువరించేనా?

ఇటీవల రాజోళి పోలీస్ స్టేషన్కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ పవన్ కుమార్ అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటారనే ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పోలీసుల ప్రత్యేక నిఘాతో ఈ దందాకు అడ్డుకట్ట పడుతుందా అనే చర్చ సాగుతోంది.

ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం 

ఇదిలా ఉండగా, అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఇటీవల బీజేపీ నాయకులు తహసీల్దార్ రామ్మోహన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు తుంగభద్ర నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ దందాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.